రాఖీ పండుగ శుభాకాంక్షలు-Happy Raksha Bandhan
నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండాలి. నాపైన నీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి...’ అని కోరుకుంటూ చెల్లెళ్లూ అక్కలూ అన్నలకీ తమ్ముళ్లకీ రక్షాబంధనం కట్టే సమయం వచ్చేసింది. ఏటా వచ్చే శ్రావణ పూర్ణిమ రోజుని రాఖీ పౌర్ణిమగా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకోవడం ఎప్పుడో పురాణ కాలంలో మొదలైందట. ఇదేమో కలి కాలమూ కంప్యూటర్ కాలమూ. ఫ్యాషన్‌నీ ట్రెండ్‌నీ ప్యాంటూ చొక్కాల్లా కుర్తీ పైజమాల్లా వేసుకుని తిరగడం ఈతరం
ప్రత్యేకత. అలాంటివాళ్లు రాఖీల విషయంలో మాత్రం రాజీ పడతారా... అందుకే, కట్టే రక్షాబంధనాల దగ్గర్నుంచి ఇచ్చే బహుమతుల వరకూ అన్నింట్లోనూ ఎన్నో ప్రత్యేకతలు వచ్చి చేరుతున్నాయి. అవును, ఒకప్పుడు రాఖీ అంటే ఎరుపూ పసుపు దారాలకు రక్షరేకుని చుట్టి కట్టేదే. మరి ఇప్పుడూ... మిలమిల మెరిసే రత్నాలూ ధగధగలాడే బంగారమూ... రంగురంగుల పూసలూ హరివిల్లు వర్ణాల దారాలూ... ముద్దొచ్చే ఫొటోలూ మళ్లీ మళ్లీ గుర్తుచేసే పేర్లూ... ఇష్టమైన కార్టూన్లూ రక్షించే రుద్రాక్షలూ... తియ్యటి చాక్లెట్లూ కమ్మని కుకీలూ... ఇలా ఎన్నెన్నో కొత్త సోకులతో ముస్తాబై వస్తున్నాయి రాఖీలు. అవేంటో చూద్దామా ఓసారి...
తియ్యని బంధనం
‘అమ్మా తమ్ముడు చాలా చిన్నోడు కదా... అన్నీ నోట్లో పెట్టుకున్నట్లే నేను కట్టే రాఖీని కూడా చీకేస్తాడేమో...’ అమాయకంగా అడిగింది నవ్య. అందుకు ‘ఏం పర్లేదు చిట్టితల్లీ నువ్వు తమ్ముడికి చాక్లెట్ రాఖీ కట్టెయ్. వాడు దాన్ని ఎంచక్కా తినేస్తాడు’ అని నవ్వేసింది అమ్మ. నిజమే... ఇపుడు మార్కెట్లోకి చాక్లెట్లూ కుకీలూ క్యాండీలూ అంటించిన రక్షాబంధనాలు వస్తున్నాయి. చిన్న చిన్న చాక్లెట్లకూ రకరకాల రంగుల్లో అలంకరించిన కుకీలకూ క్యాండీలకూ కింది భాగంలో రాఖీ దారాలు అంటించి తయారుచేసే ఇవి ప్రముఖ నగరాల్లోని కెఫేలు, బేకరీల్లో దొరుకుతున్నాయి.
మధుర జ్ఞాపకం!
సోదరి మామూలు రాఖీని కట్టినా అన్నలూ తమ్ముళ్లూ అపురూపంగా చూసుకుంటారు. అలాంటిది తామిద్దరూ కలిసున్న పొటోతో కూడిన రాఖీనో సోదరుడి పేరు చెక్కి ఉన్న రక్షాబంధనాన్నో కడితే ఇంకెంత సంతోషపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈతరహా రాఖీలను కట్టాలనుకునేవాళ్లు ఫొటో లేదా కావలసిన పేరు ఇస్తే అప్పటికప్పుడు ప్రింట్ చేసి ఇస్తున్నారు షాపుల్లో. ఆసమ్ బ్రదర్, డియర్ బ్రో లాంటి పదాలున్న రాఖీలు వీటిలో మరోరకం.
స్వర్ణమయం...
రాఖీ కట్టి అన్న దగ్గరా తమ్ముడి దగ్గరా బహుమతులు తీసుకోవడమే కాదు, తామూ గుర్తుండిపోయేలా ఏదైనా ఇవ్వాలనుకునే వారికోసం వస్తున్నవే పుత్తడి రాఖీలు. వీటిలో రక్షాదారం మధ్యలో ఓంకారం, వినాయకుడి బొమ్మలాంటి రూపాలతోపాటు కావల్సిన పేర్లూ అక్షరాలూ చెక్కిన బంగారు లాకెట్లు ఉంటాయి. రాఖీ పండగ అయిపోయాక లాకెట్టుని విప్పి మెడలోని చెయిన్‌కి తగిలించుకోవచ్చు.
ఇష్టమైన బొమ్మలు...
ఎన్ని మెరిసే రాళ్లూ రత్నాలూ ఉన్న రాఖీలు కట్టినా చిన్నారి తమ్ముళ్లు పెద్దగా పట్టించుకోరు. అదే డోరెమాన్, ఛోటాబీమ్... లాంటి కార్టూన్ క్యారెక్టర్లున్నవి కనిపిస్తే ఎంత సంతోషపడిపోతారో. కాబట్టే పిల్లలకు నచ్చేలా రకరకాల బొమ్మలున్న రక్షాబంధనాలూ వస్తున్నాయి.
రుద్రాక్ష... రక్ష!
రక్షాబంధనం... అంటేనే సోదరుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కట్టేది. కానీ ఆ రాఖీని పండగైన వెంటనే తీసేస్తారు. అలాకాదు, నా అన్నకూ తమ్ముడికీ నేను కట్టే రక్షాదారం రోజూ ఉండాల్సిందే అని కోరుకునే చెల్లెళ్లూ అక్కల కోసం రుద్రాక్షలతో చేసిన రాఖీలు మార్కెట్లో బోలెడన్ని. రుద్రాక్షల్ని ధరించడం వల్ల మంచి జరుగుతుందనీ ఆరోగ్యంగా ఉంటారనీ నమ్ముతారు కాబట్టి ఈ దారాల్నైతే ఎప్పుడూ చేతికి ఉంచుకోవచ్చు.
మరచిపోలేని కానుక
సోదరుడు దగ్గరుంటే నేరుగా వెళ్లి, హారతి ఇచ్చి, రాఖీ కట్టి, స్వీటు తినిపించొచ్చు. మరి దూరంగా ఉంటే ఇవన్నీ చేయడం ఎలా... అని బాధపడాల్సిన పనికూడా లేదు. ఎందుకంటే, చూడచక్కగా అలంకరించిన థాలీలో కుంకుమా అక్షితలూ స్వీట్లతో పాటూ రాఖీని కూడా అమర్చిన ప్యాకింగ్‌లు ఎన్నో ఆన్‌లైన్ షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి. నచ్చినదాన్ని ఎంపికచేసుకుని చేరవలసిన అడ్రెస్ ఇస్తే చాలు, మనం వెళ్లలేకపోయినా మన ప్రేమ అన్నా, తమ్ముళ్ల చెంతకు చేరిపోతుంది.
‘నీతో కలసి ఆడిన ఆటలు గుర్తు. గిల్లి కజ్జాలు గుర్తు. పంచుకున్న మిఠాయిలు గుర్తు. చెప్పుకున్న కబుర్లు గుర్తు... అన్నీ మధుర జ్ఞాపకాలే’... అంటూ అక్కలూ చెల్లెళ్ల మీద ఉన్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చి వారికి కానుకలు ఇస్తే ఎంత బాగుంటుందో కదా... ఇలాంటి మనసులోని మాటల్ని కుషన్‌లూ టీ కప్పులూ వాటర్ బాటిళ్లలాంటి వాటిమీద ప్రింట్ చేసి ఇస్తున్నాయి కొన్ని షాపులు. లేదు, సింపుల్‌గా ‘ఐ లవ్ మై సిస్టర్, వర్ల్డ్‌్స బెస్ట్ సిస్...’ లాంటి మెసేజ్‌లు ఉన్న కానుకలు ఇద్దామనుకుంటే ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి.
తీయని వేడుక చేసుకుందామా...
రాఖీ కట్టాక అన్న/తమ్ముడు నోటిని తీపి చెయ్యడంలో కూడా కొత్తదనాన్ని చూపించేందుకు ఇపుడు బేకరీల్లో పైభాగంలో రాఖీలను అమర్చినట్లు తయారుచేసిన కప్‌కేకులూ కేకులూ దొరుకుతున్నాయి. చేతికి దారం రాఖీ నోటికి కేకు రాఖీ అన్నమాట. చాక్లెట్లు ఇష్టమైనవారికి హ్యాపీ రాఖీ, ఐలవ్యూ బ్రో... అని రాసున్న చాక్లెట్లను కూడా తినిపించొచ్చు.
సంక్రాంతి, దీపావళి, దసరా... ఇంట్లో అందరూ జరుపుకునే పండగలు. కానీ రాఖీ పౌర్ణమి మాత్రం కేవలం అన్నా చెల్లెళ్లూ అక్కాతమ్ముళ్లకు మాత్రమే ప్రత్యేకం. అలాంటి పండగను ఈమాత్రం విభిన్నంగా వినూత్నంగా జరుపుకోవాలనుకోవడంలో తప్పులేదులెండి. పైగా ఆ ఫొటోలన్నిటినీ ఇన్‌స్టాగ్రామ్‌లూ ఫేస్‌బుక్‌లలో పెట్టి మిగిలిన సోదరసోదరీమణుల లైకులు కూడా సంపాదించాలిగా... మరి మీరూ కట్టారా ‘సమ్‌థింగ్ స్పెషల్’ రక్షాబంధనం?





No comments:
Post a Comment