Wednesday, August 22, 2018

వివాహేతర సంబంధం వలన ప్రాణము కోల్పోయిన యువతి


 వివాహేతర సంబంధం వలన ప్రాణము కోల్పోయిన యువతి






మనుబోలు, న్యూస్‌టుడే :

వివాహేతర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. పథకం ప్రకారం మహిళను హత్య చేసి పరారైన నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 10న మనుబోలు మండలంలోని వీరంపల్లి అడ్డరోడ్డు సమీపంలో పాడుబడిన వెంకయ్యస్వామి ఆలయం వద్ద జరిగిన మహిళ దారుణ హత్య కేసును తక్కువ సమయంలోనే పోలీసులు ఛేదించారు. గూడూరు డీఎస్పీ రాంబాబు స్థానిక ఠాణాలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. హతురాలు వెంకటాచలం మండలం ఇస్కపాలెంకు చెందిన బిరదవోలు కల్యాణి(35)గా గుర్తించారు. రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను ఆమె చూసుకొంటుండేది. నిందితుడు సైదాపురం మండలం ఊటుకూరుకు చెందిన పోతుగుంట హరినాథ్‌తో 2006 నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు. గతంలో ఈమె భర్త వేణుగోపాల్‌రెడ్డితో కలిసి సైదాపురం మండలం ఊటుకూరులో కొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ హరినాథ్‌ ఇంటిలో బాడుగకు ఉండేవాళ్లు. ఆ సమయంలో కల్యాణితో అతనికి పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. హరినాథ్‌ 2010లో బంధువులు కుదిర్చిన వివాహం చేసుకొన్నా కల్యాణితో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. నాలుగేళ్ల తరువాత మొదటి భార్యను వదిలివేసి ఇటీవల మరో వివాహం చేసుకున్నాడు. దాంతో కల్యాణి నేనుండగా మళ్లీ ఎందుకు వివాహం చేసుకున్నావని, తన దగ్గర తీసుకున్న డబ్బు, బంగారం ఇవ్వమని అడిగేది. ఈ కారణంగా ఆమెను ఎలాగైనా హతమార్చాలని హరినాథ్‌ నిర్ణయించుకుని తన వద్ద పనిచేస్తున్న పసుపులేటి వెంకటయ్యతో కలిసి పథకం వేశాడు. దీనిలో భాగంగా ఆమెను కాగితాలపూరు అడ్డరోడ్డుకు రమ్మని చెప్పి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై వెంకయ్యస్వామి గుడి వద్దకు తీసుకొచ్చాడు. అనంతరం ఆమె వివాహం విషయమై అతనితో గొడవ పెట్టుకోవడంతో పథకం ప్రకారం ముందుగా తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అయినా ఆమె చనిపోకపోవడంతో దూరంగా ఉన్న వెంకటయ్యను పిలిచాడు. ఇద్దరు కలిసి ఆమెను హత్య చేశారు. ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని గుడి వెనుకకు తీసుకెళ్లి తమ వెంట తెచ్చిన పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఆమె చరవాణిని పగులగొట్టి సమీపంలోని బస్‌షెల్టర్‌ వెనుక పడవేసి వెళ్లిపోయారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిపోకపోవడం, ఘటనాస్థలంలో లభ్యమైన చీర, చెప్పుల ఆధారంగా మృతురాలి బంధువులు ఆమెను గుర్తించారు. కేసు దర్యాప్తు చేపట్టిన గూడూరు సీఐ అక్కేశ్వరరావు ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా నిందితులను గుర్తించి ఈ నెల 20న అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు తాకట్టు పెట్టిన మృతురాలి బంగారు దండ, ఉంగరం, డాలర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

No comments:

Post a Comment